చౌకదుకాణాల్లో ప్రత్తిపాటి తనిఖీలు
విజయవాడ,సెప్టెంబర్3(జనం సాక్షి): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళగిరి చౌక దుకాణాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. చౌక దుకాణాల్లో తూకాలు, సరుకు నాణ్యతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతో పేదలకు నిజాయితీగా సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ పౌర సరఫరాల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి 9 అవార్డులను పొందినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే చిలకలూరిపేటలో సోమవారం 355 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద 52 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానిదేనన్నారు. చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన సరుకులను పంపిణీ చేస్తున్నామని, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి వినూత్నమైన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. సిఎం చంద్రబాబు దేశంలోనే అత్యున్నత పరిపాలనను అందిస్తున్నారని,చంద్రబాబు అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుతినడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని వ్యాఖ్యానించారు.