ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుక్మా (జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.అమానవీయ మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ తొమ్మిది మంది మహిళలు సహా 13 మంది మావోయిస్టులు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఆర్‌పీఎఫ్‌) సీనియర్‌ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్‌ కిరణ్‌ చవాన్‌ తెలిపారు. వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు.లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్‌ ముచాకి జోగా, స్క్వాడ్‌ సభ్యురాలు.. అతని భార్య ముచాకి జోగి ఉన్నారని, వీరిపై రూ.8 లక్షల రివార్డు ఉండగా.. మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉందన్నారు. మరో ఏడుగురు కార్యకర్తలపై రూ.2 లక్షల రివార్డు, ఒకరిపై రూ.50వేలు రివార్డు ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందించామని.. ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. గతేడాది సుక్మాతో సహా బస్తర్‌ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు.వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచిపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం పునరుద్ఘాటించిన నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సీఆర్పీఎఫ్‌ 86వ వ్యవస్థాపక దినోత్సవాల పరేడ్‌లో షా మాట్లాడుతూ.. మావోయిస్టులు లేని భారత్‌ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మావోయిస్టుల ఏరివేత మిషన్‌కు సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) వెన్నెముకగా నిలిచిందని ప్రశంసించారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు 70శాతానికి పైగా తగ్గి ఇప్పుడు ముగింపు దశకు చేరాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడం కోసం ప్రత్యేక కోబ్రా దళాన్ని ఏర్పాటుచేశామన్నారు.

తాజావార్తలు