జంటహత్యల కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

హంతకుడు బబ్లూ  అరెస్ట్‌
న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి): దక్షిణ దిల్లీలోని ఓక్లా ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి హత్యకు గురైన కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వారి ఇంట్లో లభ్యమైన బాలుడి స్కూల్‌ బెల్ట్‌ సహాయంతో పోలీసులు మిస్టరీ ఛేదించారు. ఏప్రిల్‌ 23న నిందితుడు బబ్లూ కుమార్‌ మోండల్‌(29) తల్లీ కొడుకుల గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. వారిని కత్తితో గొంతు కోసి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. బబ్లూ వారితో సహజీవనం చేస్తూనే వారి హత్యకు పూనుకున్నాడని గుర్తించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం భర్తను కోల్పోయిన సావిత్రి ఘోష్‌ అనే మహిళ తన కుమారుడితో కలిసి గత ఏడాది నుంచి ఓక్లా ఫేజ్‌-2లో ఉంటోంది. అయితే ఆమెతో బబ్లూ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్లు వారు దంపతులని భావించారు. అయితే గత కొన్ని నెలలుగా వారి మధ్య విభేదాలు తలెత్తాయి. బబ్లూ ఆమెను అనుమానించేవాడు. తరచూ గొడవలు పడతూ ఉండేవారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే బబ్లూకు కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్‌ అవ్వడంతో కాలు పనిచేయట్లేదు. దీంతో అతడు మరింత ఆత్మనూన్యతకు గురయ్యాడు. తల్లీకొడుకులను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను తనతో మద్యం సేవించడానికి ఒప్పించాడు. ఆమె తాగి స్పృహ కోల్పోయిన సమయంలో గొంతు కోసి చంపేశాడు. అలాగే నిద్రపోతున్న బాబును కూడా చంపేసి పారిపోయాడు. అక్కడి నుంచి పశ్చిమ్‌బంగలోని మాల్దా జిల్లాలో తన ఇంటికి వెళ్లాడు. హత్యలు జరిగిన రెండ్రోజుల తర్వాత పొరుగున ఉన్న వారు కుళ్లిన వాసన వస్తోందని ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. అప్పటి నుంచి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బబ్లూ కనిపించకపోవడంతో ఆ కోణంలోనూ విచారణ జరిపారు. అయితే అతడి అసలు పేరు, చిరునామా, ఫొటో ఏవీ దొరకలేదని పోలీసులు వెల్లడించారు. హత్యలు జరిగిన ఇంట్లో బాలుడు చదువుతున్న పాఠశాల బెల్టు దొరికింది. దానిపై స్కూల్‌ పేరు ఉండడంతో పోలీసులు ఆ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. స్కూల్‌ రికార్డ్స్‌లో బాబు తండ్రి కాలమ్‌లో బబ్లూ ఫొటో అంటించి ఉంది. దీంతో పోలీసులు ఆ ఫొటో సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. అతడు ఫోన్‌ కూడా ఉపయోగించకుండా వేరే వాళ్ల ఫోన్ల నుంచి కాల్స్‌ చేసేవాడని పోలీసులు వెల్లడించారు. చివరకు అతడిని ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో పట్టుకున్నట్లు వెల్లడించారు. హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.