జగదేవ్ పూర్ మండలంలో ఫ్రీడంరన్ కార్యక్రమాలు

మండల కేంద్రంలో  వంద మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన

జగదేవ్ పూర్, ఆగస్టు 13 జనంసాక్షి :

స్వతంత్ర భారత్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జగదేవ్ పూర్ మండలం లో ని వివిధ గ్రామాల్లో  మువ్వన్నెల మూడు రంగుల  జాతీయ జెండాలతో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు అధికారులు  ఉపాధ్యాయులు విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని  మహనీయుల త్యాగాలను స్మరిస్తూ భరతమాత నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో  మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో  స్థానిక మాస్టర్ మైండ్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు  వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు.  స్థానిక పాఠశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా గొల్లపల్లి చౌరస్తా వరకు  విద్యార్థులు జాతీయ వజ్రోత్సవ నినాదాలు జై భారత్ ..జైజై భారత్ అనే నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ అధ్యక్షులు మెరుగు బాలేషంగౌడ్, పాఠశాల కరస్పాండెంట్ రాఘవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ 75 వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు దేశ స్పూర్తిని చాటుతాయన్నారు. వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ కర్తవ్యంగా భావించి హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 22 వరకు వజ్రోత్సవ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణమూర్తి,  ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ, ఎం ఈ ఓ ఉదయ భాస్కర్ రెడ్డి, సర్పంచ్  కొత్త లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటీసి కవిత శ్రీనివాస్ రెడ్డి,  పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.