జగన్‌ను దేవుడే కాపాడ్తాడు.. : వివేక
హైదరాబాద్, జూన్ 27 : జగన్‌ను ఆ దేవుడే కాపాడ్తాడు.. ఆ దేవుడే ప్రస్తుత పరిస్థితులను మారుస్తాడు.. త్వరలోనే జగన్ తమ మధ్యకు వస్తాడని విశ్వసిస్తున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఉద్వేగంగా అన్నారు. జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకు రావడం ఖాయమని ఆకాంక్షించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిసేందుకు బుధవారం ఉదయం ఆయన అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు క్రైస్తవ మతపెద్దలు తరలి వచ్చారు. జగన్‌తో ములాఖత్‌కు అవకాశం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. దీంతో వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ వివేక విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకే జైలు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. జైలులో జగన్‌తో కలిసి ప్రార్ధనలు నిర్వహించాలన్న తమ విన్నపాన్ని జైలు అధికారులు తిరస్కరించడం దారుణమన్నారు. జగన్ జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వివేక విమర్శించారు. భగవంతుడు.. ప్రజల ఆశీస్సులతో జగన్ కడిగిన ముత్యం వలె జైలు నుంచి తిరిగి తమ మధ్యకు వస్తారన్నారు.ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌కు ప్రజాభిమానం వెన్నంటే ఉంటుందని అన్నారు.