జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురు
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఏడు అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నిర్ణీత గడువు లోగా దర్యాప్తు పూర్తి చేయడంలో సీబీఐ విఫలమైతే చట్టబద్దంగా బెయిల్ పొందే అవకాశం ఉంటుందని, తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయినందున తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ ఇటీవలే స్టాట్యూటరీ పిటిషన్‌తో పాటు మరో సాధారణ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. సీబీఐ కావాలనే కాలయాపన చేస్తోందని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాకుంటే.. సీఆర్పీసీ 167 (3) కింద బెయిల్ పొందేందుకు జగన్ అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే దర్యాప్తు కొలిక్కి వచ్చినందున సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, సీబీఐ కావాలనే బెయిల్‌ను అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అయితే, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోర్టును విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరించి బెయిల్ పిటిషన్ వేశారని వాదించింది. జగన్ బెయిల్‌కు అనర్హుడని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని తెలిపింది. సోమవారం విచారణను ముగించిన న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం తీర్పు వెలువరిస్తూ సీబీఐ వాదనతో ఏకీభవించి, జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణను రెండ్రోజులకు వాయిదా వేశారు.