జగన్‌ దీక్ష భగ్నం

1
గుంటూరు, అక్టోబర్‌13(జనంసాక్షి):

ప్రత్యేక ¬దాకోసం నిరవధిక దీక్ష చేపట్టిన వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దీక్షను పోలీసలుఉ భగ్నం చేశారు. మంగళవారం వేకువజామున జగన్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో అత్యవసర సేవల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. సోమవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో జగన్మోహన్‌రెడ్డికి వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంగళవారం వేకువజాము వరకు దీక్ష ప్రాంగణం వద్దనే వేచి ఉన్నారు. తొలుత దీక్ష విరమించాలని పోలీసులు జగన్‌ను కోరగా ఆయన నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ దశలో పోలీసలుఉ వారిని పక్కకు తప్పించి బలవంతంగా వ్యాన్‌ ఎక్కించారు. అప్పటికే ప్రత్యేక బృందంతో ఉన్న పోలీసులు భారీగా మోహరించి జగన్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ కార్డియాలజీ విభాగంలో జగన్‌కు వైద్యసేవలందించారు. జగన్‌కు వైద్యం అందిస్తున్నామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజునాయుడు చెప్పారు. జగన్‌కు పల్స్‌రేట్‌ క్రమంగా మెరుగుపడుతుందని, చికిత్సకు జగన్‌ సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. జగన్‌ను పరామర్శించేందుకు ఆయన కుటుంబసభ్యులు విజయలక్ష్మీ, భారతి, షర్మిలలు ఆసుపత్రికి వచ్చారు. ఫ్లూయిడ్స్‌ తీసుకునేందుకు నిరాకరించిన జగన్‌ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తామని జగన్‌ ప్రకటించారు.జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. హెల్త్‌ బులిటెన్‌ వివరాల ప్రకారం.. బీపీ 130/80. షుగర్‌ 111, యూరిక్‌ యాసిడ్‌ 13.2 గా ఉంది. కిడ్నీ పనితీరు బాగుంది. జగన్‌ మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజునాయుడు తెలిపారు. కాగా భవిష్యత్‌ కార్యచరణపై వైసీపీ ముఖ్యనేతలు జరిపిన సమావేశం ముగిసింది. తమ నాయకుడు జగన్‌తో చర్చించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు నేతలు వెల్లడించారు.