జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు!

– పీపీఏల రద్దు జీవోను కొట్టివేత
– వివాదంపై ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు సూచన
– ఆరునెలల్లో వివాదాన్ని పరిష్కరించాలని ఈఆర్సీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబర్‌24( జనం సాక్షి  : జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పీపీఏల రద్దు జీవోను హైకోర్టు కొట్టివేసింది. పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సవిూక్ష విషయంలో ఇప్పటికే జగన్‌ సర్కార్‌కు హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను సవిూక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 63ను జారీ చేసింది. ఈ విషయంపై మంగళవారం విచారించిన హైకోర్టు జీవోను కొట్టేసింది. అంతేకాదు.. పీపీఏలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు హైకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో విద్యుత్‌ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసవిూక్షకు అవకాశమే లేదన్న విద్యుత్‌ కంపెనీల వాదనను మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏల పునఃసవిూక్ష కోసం ఏపీఈఆర్‌సీకి వెళ్తామంటూ ప్రభుత్వంచేసిన వాదనను సమర్థించిన హైకోర్టు, పీపీఏలను పునఃసవిూక్షపై వాదనలను ఏపీఈఆర్‌సీ ఎదుటే వినిపించాలని పేర్కొంది. ఏపీఈఆర్‌సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్దారించలేమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ.2. 43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించింది.