జట్టులో మార్పులకు ధోనీ విముఖం
ముంబయి : ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో చిట్టచివరి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ముంబయిలో ఎంపిక జరుగుతుంది. 3వ టెస్ట్ కోల్‌కతాలో డిసెంబర్ 5-9 తేదీలలో జరుగుతుంది. 4వ టెస్ట్ నాగపూర్‌లో డిసెంబర్ 13-17 మధ్య జరుగుతుంది. అయితే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తమ జట్టులో మార్పులు చోటుచేసుకునేందుకు ఇష్టపడటం లేదు. పెద్దగా మార్పులు ఉండబోవని సోమవారం చెప్పారు. సచిన్ టెండుల్కర్‌తో సహా కొంతమంది ఆటగాళ్లు ఫామ్‌పై సందేహాలున్నాయి. మూడు ఇన్నింగ్స్‌లో సచిన్ విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆయన 29 పరుగులు మాత్రమే చేశారు. స్పిన్నర్లు ఆర్.అశ్విన్, హర్భజన్ సింగ్‌లు కూడా బౌలింగ్‌లో తమ ప్రతిభ ప్రదర్శించేందుకు కష్టపడ్డారు. అయినప్పటికీ జట్టులో సత్తా చూపించుకునేందుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి టెస్టుకు ఆటగాళ్లను మార్చడం సరైందికాదన్నారు.