జనంతోటే నేను సడక్ బంద్‌లో నేనుంట లేదన్నది
వట్టి ముచ్చట
సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారాన్ని
ఖండించిన కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనే తన ఆశయమని, ఎప్పటికీ జనంతోటే ఉంటానని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం ‘జనంసాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సడక్‌బంద్‌కు పిలుపునిచ్చిన సమయంలో తాను విదేశాలకు పోతున్నానని, అట్లైతే ఉద్యమాన్ని ఎవరు నడుపుతారంటూ సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనాన్ని, ఉద్యమాన్ని విడిచి తానెక్కడిపోనని తెలిపారు. కోదండరామ్ ఉండరు.. కేసీఆర్ బయటకు రారు ఇక సడక్ బంద్ ఎట్లా నడస్తదంటూ సీమాంధ్ర మీడియా కారుకూతలు కూస్తోందని ఇది మంచి పద్ధతి కాదన్నారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చిందంటే అది ప్రజలందరికీ సంబంధించిందని, అంతకుమించిన కార్యక్రమాలు తనకేముంటాయన్నారు. తాను ఆ సమయంలో అమెరికా వెళ్తున్నట్లు సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పది జిల్లాల్లోని నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ కోరుకుంటున్నారని, వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత ఆకాంక్షను ఢిల్లీకి చాటేందుకు ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. వాళ్లని యాది చేసుకుంటే గుండెలో మంట పుడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల శవాలపై ప్రమాణం చేసిన వారు అన్నీ మరిచి మంత్రి పదవులను అనుభవిస్తున్నారని, వారంతా తెలంగాణ ద్రోహులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి మంది బిడ్డలను కోల్పోయిన కుటుంబాలు రోదిస్తుంటే వీరికి పదవుల్లో కొనసాగేందుకు మనసెలా వస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్రుల చెప్పుచేతల్లో ఉన్న మీడియా ఇష్టం వచ్చినట్లు వార్తలు అల్లుకు పోతే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాను ఇతర జేఏసీ ప్రతినిధులు తెలంగాణ ఉద్యమాన్ని వీడి ఎక్కడికీ పోరన్నారు. తమ నేతృత్వంలోనే సడక్‌బంద్‌ను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ పెద్దలు అదిరిపడేలా, పదవులను వీడకుండా అంటిపెట్టుకున్న తెలంగాణ నేతల పీఠాలు కదిలేలా సడక్ బంద్‌ను నిర్వహిస్తామన్నారు. తమకు వేరే ఆశలు, ఆకాంక్షలు లేవని, తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షే తమదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజే అందరికీ పండుగ రోజు అని అన్నారు. అంతకుమించిన వేడుకలేమి లేవన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.