జనంలోకి దూసుకెళ్తున్నాం

` అధికారంలోకి వచ్చేది మళ్లీ మేమే..
` కాంగ్రెస్‌, కమలం పార్టీలు ఆలుమగలుగా మారాయి
` బీజేపీ భూస్థాపితం ఖాయం.. 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు
` మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని చర్చిస్తాం
` ప్రతిపక్షాల తీరు వల్లే ఉద్యోగ నియామకాలు ఆలస్యం
` మీడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు
హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్‌ 21 (జనంసాక్షి):
90శాతం మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇప్పటికే బీఫారాలు అందించి బీఆర్‌ఎస్‌ అన్ని అంశాల్లో ముందున్నదని, జనంలోకి ‘గులాబీ’ సైన్యం దూసుకెళ్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల్లోనూ ముందుంటామని, కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నామని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ ముందే రేసు నుంచి తప్పుకున్నట్టు కనబడుతోందని, 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్‌కు నలభైచోట్ల అభ్యర్థులే లేరని తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో భాగంగా కేటీఆర్‌ పలు అంశాలను వివరించారు.
‘మేం గతంలో కన్నా మంచి స్థానాలు గెలువబోతున్నాం. కేసీఆర్‌ పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం ఉంది. ఉద్యోగ నియమాకాల్లో కాంగ్రెస్‌ సంవత్సరానికి వెయ్యి భర్తీ చేస్తే మేము 13 వేలు భర్తీ చేశాము. ఏ రంగంలో చూసినా కాంగ్రెస్‌ కన్నా ఎన్నో రెట్లు ప్రగతి చేసి చూపాం. అది మెడికల్‌ కాలేజీలు కావచ్చు. సాగునీటి రంగం కావచ్చు. విద్యా వైద్యం కావచ్చు. అది ఏ విషయంలోనైనా కేసీఆర్‌కు కాంగ్రెస్‌కు పోలికే లేదు. వాళ్ళ పాలన కాలంలో 20 శాతం కూడా మేము పాలన చేయలేదు. అయినా ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి చూపాం’ అని కేటీఆర్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ సాండ్‌ మాఫియా అనడం విచిత్రంగా ఉందని, దేశంలో అద్భుతమైన ఇసుక పాలసీ తెలంగాణలో ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ హయంలో కన్నా ఎన్నో రెట్లు ఇసుక మీద రాష్ట్రానికి ఆదాయం సంపాదించాం.. విద్యుత్‌ సామర్ధ్యాన్ని 25 వేల మెగావాట్లకు తీసుకెళ్లాం అని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ అభిమానం చెదరలేదు
బీఆర్‌ఎస్‌పై ఓటర్ల అభిమానం చెక్కుచెదరలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాము బలహీనంగా ఉన్నామనుకున్న నియోజకవర్గాల్లో కూడా పుంజుకున్నామన్నారు. పోయినసారి కూడా సర్వేలు మాకు తక్కువ సీట్లు ఇచ్చాయని, కానీ ఆ సర్వేలన్నీ పటాపంచలయ్యాయని గుర్తుచేశారు. ఈసారి కూడా అదే జరుగబోతోందని అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గడ్డానికి రంగు వేసుకుని సీఎం పదవికి రేడీ అయ్యారని ఎద్దేవా చేశారు. నల్లగొండలో ఈసారి కూడా అన్నీ సీట్లు గెలుస్తామని, కాంగ్రెస్‌ ఏం పందిరి వేసిందని నల్లగొండలో ఆ పార్టీకి ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. దళితబంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, దశలవారీగా అందరికీ వర్తిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్‌ అంటేనే కుంభకోణాల మేళా
కాంగ్రెస్‌, బీజేపీలు ఆలు మగలుగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌.. శివసేనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎంఐఎం ఎప్పుడూ తాను ముస్లింల కోసమే పని చేస్తామని చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ అంటే కుంభకోణాల కుంభ మేళా అని వర్ణించారు. మైనారిటీలకు దేశంలో ఎవ్వరూ చేయని మేలు తాము చేశామన్నారు. రాహుల్‌ పీఎం అయ్యేది లేదు.. దోశలు వేసుకుంటూ వుండాల్సిందేనని ఎద్దేవాచేశారు. రాహుల్‌వి లేకి మాటలు.. ప్రధాని నోరు తెరిస్తే అబద్ధాలు అని విమర్శించారు. బండి సంజయ్‌ ఛత్తీస్‌ఘడ్‌లో స్టార్‌ కాంపైనర్‌గా వెళ్లి ఏ భాషలో మాట్లాడుతారోనని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ 119 స్థానాల్లో రాజేందర్‌నే అభ్యర్థిగా దింపుతుందేమోనని చమత్కరించారు. అయితే రెండుచోట్ల ఆయన ఓటమి ఖాయమన్నారు. నేడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వార్‌ రూం ఇంచార్జీల మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని, మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల తీరు వల్లే ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్నాయని, వచ్చేసారి జాబ్‌ క్యాలెండర్‌ను పటిష్టంగా అమలు చేస్తామని, టీఎస్‌పీఎస్సీ మరింత బలోపేతం చేస్తోందని వివరించారు.
కులగణనపై స్పందించింది మేమే : కేటీఆర్‌
కుల గణనపై తాము ముందుగా స్పందించామని, అసెంబ్లీలో తీర్మానమూ ఆమోదించామని కేటీఆర్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ తాను లేచినప్పుడే తెల్లారింది అనుకుంటున్నారని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీనిచ్చారు. ముదిరాజ్‌లంటే కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమన్నారు. అందుకే ముదిరాజ్‌ను రాజ్యసభకు పంపారని, ఇక్కడ ముదిరాజ్‌కు కీలక మంత్రి పదవి కూడా ఇచ్చారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్‌లకు మండలిలో నామినేటెడ్‌ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీ నీతులు చెబుతోందని, రాహుల్‌ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.