జనసేనకు ఆకుల గుడ్‌బై

– రాజీనామా పత్రాన్ని పవన్‌కు పంపించిన సత్యనారాయణ
– మళ్లీ బీజేపీలో చేరే అవకాశం!
విజయవాడ, అక్టోబర్‌5  (జనంసాక్షి):  జనసేన పార్టీకి సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ షాకిచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్‌ కల్యాణ్‌ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని శనివారం పవన్‌కు పంపించారు. కాగా పవన్‌ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్‌ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం.. మరికొంత మంది నేతలు కూడా ఇదే బాటలో నడుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.  ఇక ఆకుల సత్యనారాయణ విషయానికి వస్తే… 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఈయనకు రాజమండ్రి లోక్‌ సభ స్థానం కేటాయించారు పవన్‌ కళ్యాణ్‌. కానీ ఆయన ఎన్నికల్లో ఘోర ఓటమి చెందారు. ఇక అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన పార్టీ మారుతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ తీరుపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆకుల కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఉభయ గోదావర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా కాపులున్నారు. వీరు వైసీపీలో చేరితే..పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో మారుతుండడం గమనార్హం. జనసేన నుంచి నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలాఉంటే నాయకులు పార్టీని వీడుతున్నా అధినేత పవన్‌ పెద్దగా పట్టించుకోవటం లేదని సమాచారం. నాయకులను బుజ్జగించి తమ పార్టీలోనే ఉంచేలా ప్రయత్నాలు చేయకపోవటంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని తెలుస్తుంది. మరోవైపు ఆకుల సత్యనారాయణ ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఆయన బీజేపీలో చేరుతారని ఆయన అనుచరులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన వైసీపీలో చేరుతారని, ఇప్పటికే వైసీపీ నేతల నుంచి పిలుపు అందిందని, అందుకే ఆకుల జనసేనకు రాజీనామా చేశారని ప్రచారం సాగుతుంది.