జమ్మికుంట మార్కెట్‌ కార్యదర్శి సస్పెన్షన్‌

జమ్మికుంట, జనంసాక్షి : జమ్మికుంట వ్యవసాయ మార్కెట& ఇన్‌ఛార్జి కార్యదర్శి సత్యనారాయణ సస్పెన్షన్‌కు గురయ్యారు. భాపస (భారత పత్తి సంస్థ) పత్తి కొనుగోళ్లలో నెలకొన్న అక్రమాల్లో ఆయన నిర్లక్ష్యం కూడా ఉందనే కారణంగా మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి శనివారం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీచేశారు. జమ్మికుంట మార్కెట్లో ఈ సీజన్‌కు సంబంధించి నారుడు నవంబరులో భాపస పత్తి కొనుగోళ్లు చేపట్టిన విషయం తెలిసిందే. అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి మార్కెట్‌ అధికారులు ధ్రువీకరిస్తేనే భాపస అధికారులు రైతుల్నుంచి పత్తి కొనాలి. కానీ మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యంతో మొదట్నుంచి భాపస కేంద్రం గతితప్పింది. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా పాలనాధికారి విచారణ జరిపించిన విషయం విధితమే. తప్పుడు ధ్రువపత్రాలు జారీచేశారనే కారణంగా జమ్మికుంట మండలానికి చెందిన వీఆర్వో రాజమౌళిని సస్పెండు చేసిన కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ పత్తి కొనుగోళ్లతో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వానికి సైతం నివేదిక సమర్వించారు. దానిని పరిశీలించిన మార్కెటింగ్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి జమ్మికుంట మార్కెట్‌ కార్యదర్శి నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్థరించి సస్పెండు చేశారని వరంగల్‌ ప్రాంతీయ మార్కెటింగ్‌ అధికారి సుధాకర్‌ ‘జనంసాక్షి’ కి వెల్లడించారు.