జమ్ములో హోరాహోరీ ఎన్‌కౌంటర్
– ప్రాణాలతో పట్టుబడ్డ మిలిటెంట్
– ముగ్గురు మృతి
– మృతుల్లో ఇద్దరు జవాన్లు, ఒక మిలిటెంట్
శ్రీనగర్,ఆగస్ట్ 5(జనంసాక్షి):
జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్లపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో వారి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించగా, ఉస్మాన్ అనే ఉగ్రవాది ప్రాణాలతో భద్రతాదళాలకు చిక్కాడు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ప్రాణాలతో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ నోరు విప్పాడు. ఇక్కడ దాడి చేయడానికి 12 రోజుల క్రితమే పాక్ నుంచి భారత్ చేరుకున్నానని తెలిపాడు. ప్రాథమిక విచారణలో ఉస్మాన్‌ను జైష్‌ఈమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడు చెప్పిన విషయాల్ని సైతం వెల్లడించారు.భారత్‌కి ఎలా వచ్చారని పోలీసులు అడిగిన ప్రశ్నలకుగాను ఉస్మాన్ ఇలా సమాధానం ఇచ్చాడు. ‘పాక్ నుంచి 12 రోజుల క్రితమే ఇద్దరం ఇక్కడికి చేరుకున్నాం. అడవుల గుండా ప్రయాణించి భారత్‌లో ప్రవేశించాం. తాము కూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలు మూడు రోజుల వరకు సరిపోయాయి. ఆ తరువాత ఓ ఇంట్లో చొరబడి ఆహారాన్ని దొంగిలించాం.’ అని చెప్పాడు.