జమ్మూలో స్కూలు బస్సుపై రాళ్ళ దాడి

– ఓ చిన్నారి పరిస్థితి విషమం
శ్రీనగర్‌, మే2( జ‌నం సాక్షి) : జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. కనీస మానవత్వం లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. అభంసుభం తెలియని పసి బాలలు ప్రయాణిస్తున్న బస్సుపై బుధవారం ఉదయం రాళ్ళు కురిపించాయి. షోపియాన్‌ జిల్లా, కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ళ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది, మిగిలిన విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో దిగ్భాంత్రికి గురయ్యారు. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి, చికిత్స
చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెయిన్‌బో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బస్సుదాడికి గురైనట్లు పోలీసులు చెప్పారు. ఈ బస్సులో 50మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధిత బాలుడి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే వ్యతిరేకమని ఆరోపించారు. ఎవరి బిడ్డకైనా ఇలా జరగవచ్చునన్నారు.