జర్నలిజం బాధ్యాతాయుతమైన వృత్తి: ప్రధాని

 

పాత్రికేయులకు ప్రధాని సందేశం

న్యూఢిల్లీ, నవంబర్‌ 16: జర్నలిజం అనేది బాధ్యాతాయుతమైన విధి అని, సాంఘీక, సామాజిక పరిరక్షణకు పాత్రికేయులు పనిచేయాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం ప్రెస్‌ దినోత్సవం సందర్భంగా ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలువబడే జర్నలిస్టులు బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రజలు, సామాజిక జీవనంలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడమే దీనికి పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య పునాదులు పటిష్టంగా ఉంటాయని అన్నారు. సామాజిక జీవనంలో మార్పు తెచ్చే శక్తి మీడియాకు మాత్రమే ఉందని అన్నారు. మీడియాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ప్రజల హక్కులను తెలియజేస్తూ సమాజంలో చైతన్యం తెచ్చే బాధ్యత పాత్రికేయులపై ఉందని గుర్తు చేశారు. సన్సేషన్‌ పేరుతో సమాజంలో అవాంఛనీయ ధోరణి కల్పించవద్దని అన్నారు. జర్నలిజం ఒకవిధంగా దేశ సేవలాంటిదని, మీడియా ప్రతినిధులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంసించారు.