జర్నలిస్ట్‌ హత్య కేసులో ఛోటా రాజన్‌ దోషి

– ముంబాయి ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం తీర్పు
న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : దాదాపు ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జర్నలిస్టు జ్యోతిర్మయి డే(56) హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌ దోషి అని కోర్టు తేల్చింది. మాజీ జర్నలిస్ట్‌ జిగ్నా వోరాను నిర్దోషిగా విడుదల చేసింది. ముంబయిలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ కైం రిపోర్టర్‌ అయిన జ్యోతిర్మయి డే మిడ్‌డే పత్రికలో పనిచేసేవారు. 2011జూన్‌లో తన ఇంటి సవిూపంలోనే ఆయనను తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌ జర్నలిస్ట్‌ను హత్య చేయాలని ఆదేశించాడని అధికారులు దర్యాప్తులో గుర్తించారు. 20 మంది గ్యాంగ్‌స్టర్లకు సంబంధించిన సమాచారంతో జ్యోతిర్మయి డే ఓ పుస్తకం రాయాలనుకున్న నేపథ్యంలో ఛోటా
రాజన్‌ ఈ హత్యకు పురమాయించాడు. జ్యోతిర్మయి డేను హత్య చేసేందుకు ఛోటా రాజన్‌.. రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, కాంట్రాక్ట్‌ కిల్లర్‌ను నియమించాడని పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులు ‘ది ఏషియన్‌ ఏజ్‌’కు చెందిన బ్యూరో చీఫ్‌ జిగ్నా వోరాను అరెస్ట్‌ చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. వోరా.. ఛోటా రాజన్‌తో టచ్‌లో ఉన్నాడని, ఆయనే జ్యోతిర్మయి డేను చంపాలని రెచ్చగొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో 2015 నవంబరులో అధికారులు ఛోటా రాజన్‌ను ఇండోనేషియాలో పట్టుకుని భారత్‌కు తీసుకొచ్చారు. రాజన్‌ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్నాడు. జిగ్నా వోరాను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా.. జర్నలిస్టును కాల్చి చంపిన షూటర్స్‌ సతీష్‌కలియా, అనిల్‌ వాఘ్‌మోడే, అరుణ్‌ ఫకే, మంగేశ్‌ అగవానేలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి శిక్షలు ఖరారు కావాల్సి ఉంది.