జలయజ్ఞంలో 21లక్షల ఎకరాలకు నీరందించాం
వచ్చే రెండేళ్ళలో 30లక్షల ఎకరాలకు సాగునీరు.
2013కల్లా హంద్రీనీవా రెండో దశ పూర్తి
పోలవరం, ప్రాణహితలకు జాతీయ హోదా తీసుకువస్తాం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి
అనంతపురం, నవంబర్ 29 : రాబోయే రెండేళ్ళలో మరో 30లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, ఇప్పటివరకు 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని, మరో రెండేళ్లలో మొత్తం 50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అనంతవెంకటరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు కృష్ణాజలాలు విడుదల చేసిన సందర్భంగా రెవెన్యూ శాఖ ముంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన భగీరథ
విజయపాదయాత్ర గురువారంతో ముగిసిన ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సభకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అధ్యక్షత వహించారు. జలయజ్ఞం కోసం ఇప్పటివరకు రూ.70వేలకోట్లు ఖర్చుచేశామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం మరో రూ. 16వేల కోట్లు ఖర్చు చేయగలిగితే 6లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. 2013 నాటికల్లా హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం, ప్రాణహితకు జాతీయ హోదాను తీసుకువస్తామని స్పష్టం చేశారు. హంద్రీనీవా జలాశయ నిర్వాసితులకు భూ పరిహారంగా సక్రమంగా చెల్లిస్తామని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 1250 అడుగుల నీటిని రైతాంగానికి అందించాలన్నది లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు తొలి దశ పూర్తవడంతో పండుగ వాతావరణం మాత్రమే నెలకొందని ఇక్కడితో తమ కర్తవ్యం పూర్తి కాలేదని అన్నారు. మరో ఆరులక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించినప్పుడే అసలైన పండుగ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో 40టిఎంసీల నీరు అందిస్తామన్నారు. ప్రొజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడం కష్టమేనని చెప్పారు. నాగార్జున్ సాగర్ 1955లో మొదలై 2005నాటికి పూర్తయిందని, ఎస్‌ఆర్‌ఎస్పీ 1962లో మొదలై 2012నాటికి పూర్తయిందని, ఇంకా మరో రెండేళ్ళపాటు పనులు జరగాల్సి ఉందని చెప్పారు. తెలుగు గంగ 1986లో మొదలై 2012 వరకు కొనసాగుతుందని, ఇది పూర్తయ్యేందుకు మరో మూడేళ్ళు పడుతుందని చెప్పారు. హంద్రీనీవా పథకాన్ని వాస్తవానికి 2007లో ప్రారంభించారని, ఇది పూర్తయ్యేందుకు 2014వరకు పడుతుందని చెబుతున్నారన్నారు. అయితే 2013చివరి నాటికి ఈ పథకం రెండో దశ కూడా పూర్తవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. రాయలసీమలో నాయకులు పార్టీలకు అతీతంగా నాలుగు దశాబ్దాలుగా సాగునీటి కోసం పోరాటాలు చేశారని చెప్పారు. వెయ్యి మైళ్ళ దూరమైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీమ్, ఖమ్మం జిల్లాలో కిన్నెర సాని, తూర్పు గోదావరిలో భూపతి పాలెం, మహబూబ్‌నగర్‌లో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, అనంతపురంలో హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.