జలయజ్ఞం పేర బడా కాంట్రాక్టర్లు
రాష్ట్ర ఖాజానాను దోచేస్తున్నరు : ఈటెల
హైద్రాబాద్, ఆగస్టు27(జనంసాక్షి): కాంట్రాక్ట్ విధానంలో ప్రవేశపెట్టిన ఈపీసీ విధానం వల్ల బడా కాంట్రాక్టర్‌లకు అనుకూలంగా మారిందని, బడా కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ విధానం జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచే మొదలైందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దుచేయలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం మింట్ కాంపౌండ్‌లోని సీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టడానికే ఈపీసీ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఈ విధానంతో పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కోట్ల రూపాయల లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు ఎంతో అనుభవమున్నా వారికి టెండర్ దక్కకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టర్లు అడుగుపెడితే చూస్తూఊరుకొనేది లేదన్నారు. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టర్లు అడుగుపెడితే జరగబోయే పరిమాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.