జలశక్తి అభియాన్ పథకం పనులు భేష్

– కేంద్ర హోమ్ ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చేంగ్ వర్తింగ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జలశక్తి అభియాన్ పధకం ద్వారా చేపట్టిన వివిధ పనులల్లో మెరుగైన అభివృద్ధి కనబడుతుందని కేంద్ర హోమ్ ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చింగ్ వర్తింగ్,  రూర్కె సైంటిస్ట్ ఆర్ కె  నేమా అన్నారు.గురువారం పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామంలో రైతు నిమ్మ వెంకట కృష్ణయ్య మామిడి తోటలో ఉద్యాన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్, వర్షపు నీరు నిల్వ తో చేపల పెంపకం,మామిడి తోటకు డ్రిప్ తో అందిస్తున్న నీటిని పరిశీలించారు.ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందించే ప్రతి పథకాన్ని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగించుకోవాలని రైతును అభినందించారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఇప్పటికే జిల్లాలో  ముందుకొచ్చిన రైతులకు 20 ఫామ్ పాండ్ లు సబ్సిడీ ద్వారా రైతులకు ఏర్పాటు చేశామని వివరించారు.గ్రామంలో పల్లె ప్రగతి, నర్సరీ, వైకుంఠాధమం పరిశీలన అనంతరం పట్టణాలకు పోటీగా గ్రామాల్లో అద్భుతమైన ప్రగతి కనబడుతుందని అన్నారు.గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి   పచ్చదనంపై సంతృప్తి వ్యక్తం చేశారు.పర్యాటనలో భాగంగా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి, జలశక్తిపై విద్యార్థులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని జలసంరక్షణపై నీటి వినియోగం, వర్షం నీటిని నిల్వ చేసి భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.సంపూర్ణ విషయ పరిజ్ఞానాన్ని సమాజ సేవకు ఉపయోగపడేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం భూసార పరీక్ష కేంద్రం , విత్తన తయారీ కేంద్రం, చేపల చెరువు, పట్టు పురుగుల కేంద్రం, జీవ ఎరువుల తయారీని  పరిశీలించి కేంద్ర నిర్వాహకులను అభినందించారు.అనంతరం సూర్యాపేట దురాజ్ పల్లిలో పట్టణ ప్రకృతి వనం, అలాగే  సద్దల చెరువును పరిశీలించి పర్యాటక స్థలంగా చేసి ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.అంతకుముందు జలశక్తి అభియాన్ కింద నీటి సంరక్షణకై జిల్లాలో చేపట్టిన అన్ని  అభివృద్ధి పనులసై కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కేంద్ర బృందం మాట్లాడుతూ  జిల్లాలో జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టిన పనులలో ఎంతో అభివృద్ధి కనబడుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులను కేంద్ర బృందం అభినందించారు.కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని సందర్శించి పథకాల అమలుపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్,సిఈఓ సురేష్ , పిడి కిరణ్ కుమార్, డిఎఫ్ఓ ముఖుందా రెడ్డి, డిపిఓ యాదయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు