జాతి విద్వేషంతోనే కాల్పులు జరిపాను
– కూచిభొట్ల కేసులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
వాషింగ్టన్, మే22(జనం సాక్షి ) : అమెరికాలో భారత టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో ఇప్పటికే జీవిత ఖైదును అనుభవిస్తున్న నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ జాతి విద్వేషం కేసులో తన నేరాన్ని అంగీకరించాడు. జాతి విద్వేషం కింద దాఖలైన మూడు ఫెడరల్ ఛార్జెస్‌లలో తన నేరాన్ని అంగీకరిస్తూ అమెరికా కోర్టులో సోమవారం వాంగ్మూలం ఇచ్చాడు. జాతి విద్వేషం ఆరోపణల కేసులో ప్యూరింటన్‌కు మరణ శిక్ష పడే అవకాశం ఉంది. అయితే నేరాన్ని అంగీకరించడంతో శిక్షను జీవిత ఖైదుకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈకేసులో జూన్ 2న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. యూఎస్ నేవీకి చెందిన 53ఏళ్ల ప్యూరింటన్.. కూచిభోట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిపినట్లు అంగీకరించాడు. జాతి విద్వేషం కారణంగానే వారిద్దరినీ చంపేందుకు యత్నించానని ఒప్పుకొన్నాడు. కూచిభొట్ల హత్య కేసులో ప్యూరింటన్‌కు మే5న కోర్టు జీవితకాల శిక్షను విధించింది. అయితే జాతివిద్వేషం కేసులో గతంలో తననేరాన్ని నిందితుడు ఒప్పుకోలేదు. అయతే సోమవారం కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. గత ఏడాది ఫిబ్రవరి 22న కాన్సస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్‌తో కలిసి ఆఫీస్ పని ముగించుకొని బయటకు వస్తుండగా ప్యూరింటన్ వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కూచిభొట్ల మృతి చెందగా.. అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు.