జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషిస్తుంది

టిఆర్‌ఎస్‌ పోరాటం వల్లనే తెలంగాణ సాధ్యమయ్యింది
అవమానాలు ఎదుర్కొని ముందుకు సాగిన చరిత్ర మనది
సాధించిన తెలంగాణలో అద్భుతమైన ప్రగతి
తండాలను పంచాయితీలుగా..కొత్త జిల్లాల ఏర్పాటు మా ఘనతే
కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు అర్థం లేనివి
ప్రారంభోపన్యాసంలో కెసిఆర్‌ వెల్లడి
హైదరాబాద్‌,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  పార్టీ స్థాపించిన సమయంలో ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కున్నామని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్టాన్న్రి సాధించామన్నారు. కొంపల్లిలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేశారు.ఒంటరిగా వెళ్లి ఎన్నికల పోరులో విజయం సాధించామన్నారు. అధికారంలోకి వచ్చాక శాపనార్దాలు పెట్టారని…అవేవిూ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రధాని, పలువురు సీఎంల నుంచి ప్రశంసలు వచ్చాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ పథకాలను మాజీ ప్రధాని దేవెగౌడ అభినందించారన్నారు. కర్నాటక మంత్రి రేవణ్ణ కూడా పథకాలను మెచ్చుకున్నారని అన్నారు.  4వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేసీఆర్‌ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సుదూర ప్రయచాణం చేయాల్సి వచ్చేదన్నారు. ఆ బాధలు లేకుండా చేశామని అన్నారు. ఆశా వర్కర్లకు దేశంలోనే అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన పారదర్శకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీతి, నిజాయితీగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని, ఉద్యమాన్ని ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2001, 27న పార్టీని ప్రారంభించాం. ఆ రోజు నుంచి అనేక సన్నివేశాలు, సందర్భాలు చూశాం. అందరి అంచానాలను తలకిందులు చేస్తూ.. అనుమానాలను
పటాపంచలు చేశాం. అనేక గెలుపులు.. ఓటములు చవిచూశాం.. అద్భుతంగా తెలంగాణను సాధించుకున్నామని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా. మళ్లీ తెలంగాణ గడ్డవిూదనే అడుగుపెడుతానని చెప్పిన ఆత్మవిశ్వాసంతోనే చెప్పిన . ఆ తర్వాత కొందరు దీవెనలు ఇచ్చారు. కొందరు శాపనార్థాలు పెట్టిన వారు కూడా ఉన్నారు.  తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. నిజాయితీగా పని చేసే ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలను ప్రత్యక్షంగా ప్రజలు అనుభవిస్తున్నారు. పారదర్శకంగా ముందుకు పోతున్నాం. కొన్ని పనులు చేయాలంటే సాహసం కావాలి. ధైర్యం కావాలి. తండాలను పంచాయతీలుగా మార్చాలని అనేక సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో హావిూలు ఇచ్చి కూడా అమలు చేయలేదు. 4 వేల పైచిలుకు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశాం. తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. పరిపాలనలో సంస్కరణలు తెచ్చేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మన పాలనను ప్రధాని సహా పలు రాష్టాల్రు ముఖ్యమంత్రులు ప్రశంసించారు. 31 జిల్లాలతో తెలంగాణ అలరారుతోందన్నారు సీఎం కేసీఆర్‌.
16వ గది చూపిస్తే రాజీనామా
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ముఖ్యమంత్రి  మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోమని ఉత్తమ్‌ను కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రగతి భవన్‌లో 15 గదుల కంటే ఎక్కువ లేవు. 16వ గది ఉందని రుజువు చేస్తే.. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం స్పష్టం చేశారు. అక్కడ 16వ గది లేకపోతే ప్రగతి భవన్‌ ముందు ఉత్తమ్‌ ముక్కు నేలకు రాస్తాడా అని సీఎం ఛాలెంజ్‌ చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టీ పీసీసీ పదవి తెచ్చిందే ఈ గులాబీ జెండా అని కేసీఆర్‌ తెలిపారు. ఆనాడు పోరాటం చేయకపోతే నీవు ఈ రోజు పదవిలో ఉండే వాడివి కాదు. తమ పోరాటం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. 14 సంవత్సరాల పోరాటమే నేటి తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాలుక ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్‌ నాయకులు తెలివి లేని నేతలు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు.