జాతీయ విషాదంలో భారత్
తొలి త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ మృతి
హెలికాప్టర్ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాతఅ
ధికారికంగా ప్రకటించిన వాయుసేన
చెన్నై,డిసెంబర్8(జనం సాక్షి): దేశంలో జాతీయ విషాదం నెలకొంది. తొలి రక్షణదళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ మృతి దేశాన్ని విషాదంలోకి నెట్టింది. అత్యంత అదునాతన ఆర్టీ హెలకాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన మృత్యువుతో పోరాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ విల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నది. బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయం ఢల్లీి నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 9 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. సూలూరు ఎయిర్‌బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్టర్లో బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మరో 5 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాపర్ కుప్పకూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా మధ్యాహ్నం 1:50కి ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రం 6:03 గంటలకు బిపిన్ రావత్ మృతిని వాయుసేన అధికారికంగా ధృవీకరించి ట్వీట్ చేసింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కూనూరు కంటోన్మెంట్‌కు ఎందుకు వెళ్లారంటే.. అక్కడున్న ఆర్మీ రీసెర్చ్ కేంద్రంలో ప్రసంగించాల్సి ఉండటంతో వెళ్లారు. ఈ కేంద్రంలో దక్షిణాది రాష్టాల్రకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. ఆ కంటోన్మెంట్ ఏరియాకు చేరుకునే క్రమంలోనే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలి పోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.`