జాత్యాహంకారహత్యలో అమెరికన్‌ కోర్టు సంచలన తీర్పు

                                                                       శ్రీనివాస్‌ కూచిభొట్ల హంతకుడికి యావజ్జీవ శిక్ష
కెన్సస్‌,మే5(జ‌నం సాక్షి ): అమెరికాలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కూచిబొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో ఆ దేశ ఫెడరల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ఆడమ్‌ డబ్ల్యూ పురింటన్‌ జాత్యాహంకారంతోనే శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి అతడిని హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్థారించి జీవిత ఖైదు విధించింది.
2017 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్‌ మదసాని కెన్సస్‌లోని ఒలేత్‌ నగరంలోని ఓ బార్‌లో ఉండగా అమెరికాకు చెందిన 52ఏళ్ల ఆడమ్‌ ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ నినాదాలూ చేస్తూ వారిద్దరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ అక్కడిక్కడే మృతి చెందగా, అలోక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆడమ్‌ను అడ్డుకోబోయిన అమెరికాకు చెందిన లాన్‌ గ్రిలోట్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు ప్రకారం నిందితుడు ఇక జీవితమంతా జైలులోనే గడపాల్సి ఉంది. 50ఏళ్ల జైలుశిక్ష తర్వాతే అతడికి పెరోల్‌ లభిస్తుంది. ఇది ముమ్మాటికీ జాత్యహంకారంతో చేసిన హత్యగానే న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. ఈ తీర్పు అనంతరం కూచిబొట్ల భార్య సునయన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…’ ఈ తీర్పుతో శ్రీనివాస్‌ తిరిగి రారు. కానీ ఇలాంటి ఘటనలు ఇకముందైనా జరగకుండా చూడండి. ఈ కేసులో మాకు అండగా నిలబడిన ఓలేత్‌ పోలీసులకు ధన్యవాదాలు’ అని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు నెల తర్వాత ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. శ్రీనివాస్‌ హత్యతో అమెరికాలోని భారతీయులు ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఈ తర్వాత ట్రంప్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. భారత్‌ జాతి, అమెరికా పౌరులు
సునయనకు అండగా నిలిచారు.