జాబితా ప్రకారం చర్య తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ
ఆదిలాబాద్,నవంబర్16(జనంసాక్షి): వివిధ గ్రామాల్లో రుణమాఫీ జరగని రైతుల వివరాలను వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌కు వినతిపత్రం ద్వరా అందజేసినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ తెలిపారు.రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలని కోరమాని అన్నారు. జిల్లాలోని బూర్నూర్, లింగుగూడ, దార్లొద్ది, వాన్వట్, పిప్పల్‌ధరి గ్రామాల్లో దాదాపు 300 మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని లేదంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషమమై పలుమార్లు రైతులు జిల్లా మంత్రి జోగురామన్న, పాలనాధికారిని కలిసినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్నారని కాని జిల్లాలోని కొన్ని గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదని అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బాధిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని చెప్పుకొస్తున్నా జరగలేదని జాబితా ఇచ్చామని అన్నారు. ఈ జాబితా ప్రకారం చర్య తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఎక్కడైనా రుణమాఫీ జరగని వారుంటే చర్య తీసుకుంటామని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించినందున తాము చర్య తీసుకున్నామని అన్నారు.