జిఎస్టీతో ఏడాదిగా వేధింపులే
ప్రజల ఆందోళనలు పట్టించుకోని ప్రధాని : కాంగ్రెస్
నిజామాబాద్,జూలై3(జనంసాక్షి): జీఎస్టీ ప్రభావం ఇంకా గ్రామాలను వెన్నాడుతున్నా ప్రధాని మోడీ తీరులో మాత్రం మార్పు రాలేదని, ఇది అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంని డిసిసి అధ్యక్షుడు తాహిర్ బిన్ హుదాన్ అన్నారు. అభ్యంతరాలను జిఎస్టీ కౌన్సిల్ చర్చిస్తుందని చెప్పడం ద్వారా ఏడాదిగా వంచిస్తూ వచ్చారని అన్నారు. ముందు చేస్తున్న హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమలు చేయడం ప్రజలపై భారం మోపడం తప్ప మరోటి కాదన్నారు. పలు కారణాలతో పంట పెట్టుబడులు పెరిగి మద్దతు ధరలు అంతంత మాత్రంగానే లభిస్తోన్న అన్నదాతలకు జీఎస్టీతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. సాగులో 15 శాతం పెట్టుబడిగా ఉండే విత్తనాల ధరలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పాతికశాతం ఉండే ఎరువుల ధరలపై 12 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించడం ఏ రకమైన అభివృద్ది చర్య అవుతుందన్నారు. జీఎస్టీతో ఈ ఏడాది విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరకపోగా ఎరువుల ధరలు పెరుగుతుండడంతో నష్టపోవాల్సిన పరిస్థితి నెలకుందన్నారు. జీఎస్టీ కారణంగా విత్తనాల ధరలు తగ్గే అవకాశం ఉన్నా రైతులకు మాత్రం ఈ సీజన్‌లో ఎలాంటి ప్రయోజనం ఉండదు. జిల్లాలో ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది పంటలను రైతులు సాగుచేస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభమై 20 రోజులు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా రైతులు నెల రోజులు కిందటే విత్తనాలను కొనుగోలు చేసి వేశారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అనుకూలించకపోవడంతో వేసిన విత్తనాలు సైతం నష్టపోయారు. దీంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం లేదు. యాసంగిలో 30 వేల హెక్టార్ల పంటలు మాత్రమే సాగయ్యే అవకాశాలుండడంతో తగ్గిన విత్తనాల ధరల కారణంగా తక్కువ మంది రైతులకు ప్రయోజనం ఉంటుంది.జీఎస్టీ కారణంగా పెరిగే ఎరువుల ధరలతో రైతులు ఎకరానికి రూ.500 పైగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎరువులపై 5 శాతం వ్యాట్‌ను అమలు చేస్తున్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుండండంతో ఈ పన్ను 12 శాతం పెరుగుతుంది. ఫలితంగా ఎరువు బస్తా ఒకటి రూ.19 వరకు పెరిగే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 70 వేల మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతుండగా పెరుగుతున్న ధరల కారణంగా రూ.2 కోట్లకు పైగా అదనపు భారం రైతులపై పడనుంది. జిల్లాలో ప్రస్తుతం వ్యాపారుల వద్ద ఎరువుల నిల్వలు ఉన్నాయి. జిల్లాలోని వ్యాపారులు పెరిగిన ధరల ప్రకారం ఎరువులను విక్రయించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.