జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి : సీపీఎం
నిజామాబాద్,ఏప్రిల్5(జనంసాక్షి): జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి నిధుల కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ డిమాండ్ చేశారు. బ్యాంకర్లు రైతుల నుంచి బీమా ప్రీమియం ముక్కుపిండీ వసూలు చేస్తున్నారని, పంట నష్టపోతే పరిహారం మాత్రం అందించడం లేదని అన్నారు. ప్రతి యేటా బీమా ప్రీమియం చెల్లిస్తున్నారని, ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం మాత్రం అందలేదని వాపోయారు. జిల్లా స్థాయి సదస్సుకు బ్యాంకు, నాబార్డు అధికారులు హాజరు కాకపోవడం రైతుల పట్ల వారికి ఉన్న శ్రద్ధకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలో సీపీఎం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు కనీసం రూ.50 కూడా వచ్చే పరిస్థితి లేదని, పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంద అన్నారు. వేల కుటుంబాలు వలస పోతున్నాయని ఆందోళనచెందారు. మంచినీటి ఎద్దడి ఉన్నాఎక్కడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కరవు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చామన్నారు. బ్యాంకు అధికారులు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా బీమా కంపెనీలకే ప్రీమియం చెల్లించేలా చూడాలని సూచించారు. దళితులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపడదామని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ఎకరాల భూమి ఇస్తామని జిల్లాలో కేవలం 54 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని విమర్శించారు. బోధన్ చక్కెర కార్మగారం పునరుద్దరణ కార్మికులపై సిఎం కెసిఆర్ ఎందుకు నోరువిప్పలేదన్నారు.