జిల్లాలో జోరుగా వలసలు
గులాబీ దళంలో పెరుగుతున్న జోష్
జనగామ,మార్చి14(జనంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టిఆర్ఎస్ ముందుకు సాగడంతో గ్రామాల్లో
రాజకీయ చర్చ మొదలయ్యింది. తన సేవలు అవసరమైతే కేంద్రానికి వెళ్తానని ప్రకటన చేయడం రాజకీయాలను వేడెక్కించింది. దీంతో గులాబీ దండులో ఎక్కడ చూసినా ఇదే చర్చ కనిపిస్తోంది. దీనికితోడు గ్రామాల్లో వివిధ పార్టీల్లోంచి కార్యకర్తలను జోరుగా టిఆర్ఎస్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరేలా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కొద్దిరోజులుగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు మొదలయ్యాయి. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లోకి చేరుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఆయా పార్టీల నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో అభివృద్దికి ఆకర్షితులై ప్రతిరోజు కొందరు పార్టీలో చేరుతున్నారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకొండ్ల మండలాలకు చెందిన కాంగ్రెస్, వామపక్షాల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ కండువా కప్పుకుంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, లింగాలఘణపురం, చిలుపూరు, జఫర్గడ్ మండలాల నుంచి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. పెరుగుతున్న వలసలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.