జిల్లాలో మరోమారు భారీ వర్షాలు
రైల్వే కోడూరులో వరదముప్పుఆందోళనలో అన్నదాతలు
కడప,నవంబర్29(జనం సాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలోమరోమారు వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అట్లూరు మండలంలోని జి.కొత్తపల్లిని వరద నీరు చుట్టుముట్టింది. 15 రోజులుగా 200 కుటుంబాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిన్న కామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. రైల్వేకోడూరులో గుంజననది ఉధృతికి నాలుగు నివాసాలు కుప్పకూలాయి. నివాసాల్లో ఉన్న జనం ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడంతో ప్రాణభయం తప్పింది. రైల్వేకోడూరు పట్టణంలోని నరసరాంపేటలో గుంజన నది పక్కన ఉన్న నివాసాలకు వరద ముప్పు పొంచి ఉంది. ముందస్తుగా ఆయా ప్రాంతాల నివాసులను పునరావాసాలకు తరలించనున్నారు. ఇదిలావుంటే రైతులను పకృతి వైపరీత్యాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గత ఏడాది వరి కోతల సమయంలో భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టాల పాలైన రైతులు ఈ ఏడాది కూడా మళ్లీ అప్పులు చేసి సాగు చేపట్టారు. పైరు బాగుంది కొద్దిరోజుల్లో కోత కయొచ్చు అనుకుంటుండగా మళ్లీ ముసురు పట్టుకుంది. ఇప్పటికే కోతకు సిద్ధమైన వరి పంట నేల వాలి ధాన్యము కంకులకు మొలక లొచ్చాయి. దీంతో సాగుకు పెట్టిన పెట్టుబడిలో కనీస ఖర్చులైనా రావనే నిర్దారణకు వస్తున్నారు. అందుకు పొలాలను నిలువునా దున్నేస్తున్నారు. మరికొంతమంది దమ్ము చేస్తున్నారు. వంట కోసం ఆగితే ఇంకా రూ 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే దిగుబడి ఏవిూ ఉండదని వాపోతున్నారు. అయితే కొంత మంది రైతులు మాత్రం ఇప్పటికీ పంట పై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ తరుణంలో వచ్చిన వాన వారి ఆశలను గల్లంతు చేస్తుంది. వానల నేపథ్యంలో దిగుబడి బాగా తగ్గిపోవడంతో పాటు గింజ రంగు మారుతుందని నాణ్యత పేరుతో ధరలు అసలు ఇవ్వారని పేర్కొంటున్నారు. ఈ సమయంలో కనీసం ప్రభుత్వమే ఆదుకోవడం తోపాటు నిబంధనలు సడలించి దిగుబడి అంతా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.