జీఎస్టీ విధింపుకు నిరసనగా రేపు రైస్ మిల్లుల బంద్
, జనం సాక్షి : కేంద్ర ప్రభుత్వం బియ్యం అమ్మకాలపై జిఎస్టి విధింపును నిరసిస్తూ రేపు (శనివారం) రైస్ మిల్లుల బంద్ నిర్వహించనున్నట్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బియ్యం అమ్మకాలపై ఐదు శాతం జీఎస్టీ విధించిందన్నారు. 2017 నుంచి జిఎస్టి పన్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ బియ్యం పై ఇప్పటివరకు జీఎస్టీ ని విధించలేదన్నారు. కానీ ఇటీవల ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. జిఎస్టి టాక్స్ విధించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినందున బియ్యం ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. బియ్యం ధరలు పెరిగి సామాన్యులపై అధిక భారం పడటమే కాకుండా చిన్న తరహా రైస్ మిల్లులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రానున్నాయని వారు తెలిపారు. జిఎస్టి టాక్స్ విదింపుకు నిరసనగా ఆల్ ఇండియా రైస్ ఇండస్ట్రీ ఫెడరేషన్ పిలుపుమేరకు మిర్యాలగూడలో రైస్ మిల్లులు పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుడిపాటి శ్రీనివాస్, కార్యదర్శులు వెంకటరమణ చౌదరి (బాబి), రంగా లింగయ్య, కోశాధికారి పైడిమర్రి సురేష్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.