జీన్స్ ధరించిందని చెల్లెల్ని హత్య
లాహోర్: మగవారు ధరించే జీన్స్ దుస్తులు ధరించిందంటూ తోబుట్టువునే కడతేర్చాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ రక్షక భటుడు. శుక్రవారం లాహోర్‌లో జరిగిన ఈ ఘటనను అధికారులు శనివారం వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం నజ్మా బీబీ(22) జీన్స్ ధరించారు. మగవారిదుస్తులు ధరించడం ఆపకపోతే చంపేస్తానంటూ ఆమెని అన్న అసద్ అలీ హెచ్చరించాడు. స్థానిక పోలీసు స్టేషన్‌లో తన కానిస్టేబుల్ అన్నపై నజ్మా ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. కానీ అధికారులు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శుక్రవారం నజ్మా ఇంటి నుంచి బయలుదేరగానే ఆమె వెనకే వచ్చిన అసద్ షహదారా మార్ వద్ద కాల్పులు జరిపాడని ఆమె అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు వివరించారు. పరారీలో ఉన్న అసద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.