జుబ్లీహిల్స్‌లో కాల్పుల కలకలం
– ఇద్దరు దుండగుల పట్టివేత
– మెట్రో కార్మికునికి గాయాలు
హైదరాబాద్,ఆగస్ట్20(జనంసాక్షి):
హైదరాబాద్ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని నీరూస్ వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎల్ అండ్ టీ వర్కర్ గాయపడ్డారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంబడించి స్థానికుల సాయంతో ఇద్దరిని పట్టుకున్నారు. మరోవ్యక్తి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులకు చిక్కిన వారిలో ఒకరిని కర్నాటకకు చెందిన అబ్దుల్లాగా గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టెర్రరిస్టు కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌లో కాల్పులు జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మాదాపూర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు దుండగులను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా వారు పరారయ్యారు. వారిని పోలీసులు వెంబడించగా జూబ్లీహిల్స్‌లోని నీరూస్ షోరూం వద్ద ముగ్గురు వ్యక్తుల్లోని పహీమ్ అలియాస్ అబ్దుల్ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో నిర్మాణ కార్మికుడు ధర్మేందర్‌సింగ్ ఛాతీలోకి తూటా దూసుకెళ్లింది. భాదితుడిని హుటాహుటిన సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. వీరు కర్నాటక దోపిడి గ్యాంగ్ సభ్యులని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.