జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఏకం కండి

ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపు
కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం జండాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్దం కావాలని ప్రజా గాయకుడు గద్దర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బహుముఖ పోరాటం కాదని… ఏకోన్ముఖ పోరాం చేయాలని తెలిపారు. ఆదివారం నగరంలోని కృషి భవన్‌లో శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దళితులకు సంఘీభావంగా జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లా డుతూ కేసీఆర్‌, విద్యార్థులు, జేఏసీ ఇలా ఎవరికి వారు ప్రత్యేక పోరాటాలు చేసి సాధించేదేమీ లేదన్నారు. అందరూ జెండాలు,అజెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఏకం కావాలన్నారు. అం దరూ కలిసి గట్టిగా పోరాడితేనే తెలంగాణ సాధ్య మన్నారు. అన్ని పార్టీలు తెలంగాణ పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నాయ న్నారు. అందరూ ఏకమై పోరాడితే తెలంగాణ తప్పక సాధ్యమన్నారు. లక్ష్మింపేటలో దళితులపై దాడి దురదృష్టకరమని, ఇది అగ్రకుల దురహం కారానికి నిదర్శనమన్నారు. భూమి కోసం ఐదు గురు దళితులను హత్య చేయడం దారుణమ న్నారు. లక్ష్మింపేట వాసులకు భూమి కొరకు తాము పోరాటం చేయడానికి ముందుంటా మన్నారు. సంఘీభావ సభ పేరుతో వారిని ఆదుకొనేందుకు బియ్యం దినుసులు అందివ్వడం మంచి విషయమన్నారు. లక్ష్మింపేట ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మొగురం రమేశ్‌, నర్సింగరావు, కొరివి వేణుగోపాల్‌, రమేశ్‌ ముదిరాజ్‌, గుంటి వేణు, కులసంఘాల నాయకులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం వంట సామాగ్రి మూటను గద్దర్‌ బస్టాండ్‌లోని ఎఎన్‌ఎల్‌ కొరియర్‌ ఎత్తుకెళ్లి లక్ష్మంపేటకు పంపారు.