జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి):
జిల్లా జైలులో 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శనివారం  విడుదల య్యారు. జైలు వద్ద ఎంఐఎం నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై సంబరాలు జరుపుకున్నారు.

దీంతో జిల్లా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌ జనవరి 8న అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌ బయలుదేరారు. వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉపన్యాసాలిచ్చారనే కేసులో జైలులో ఉంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ జైలునుంచి విడుదలయ్యారు. నిర్మల్‌ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉపన్యాసా లిచ్చాడని ఆరోపణలపై పోలీసులు అరెస్ట్‌ చేయగా, న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని జైలులో ఉన్న ఆయనను ఇప్పటికే మూడుసార్లు విచారించిన న్యాయమూర్తి శుక్రవారం షరతులతో కూడిన బెయిలును మంజూరుచేశారు. అయితే ఈరోజు 25వేల నగదుతోపాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించినా, పాస్‌పోర్టును సమర్పించడంలో ఆలస్యం కావడంతో మద్యాహ్నం బెయిల్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ నిర్మల్‌ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. సాయంత్రం వరకు పాస్‌పోర్టు కూడా సమర్పించడంతో ఆయనను విడుదల చేయాలంటూ జైలు అధికారులకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జైలు అధికారులు అక్బరుద్దీన్‌ను సాయంత్రం విడుదల చేశారు. హైదరాబాద్‌నుంచి వచ్చిన తన న్యాయవాదులతో కలిసి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో అక్బరుద్దీన్‌ హైదరాబాద్‌కు తరలివెళ్లారు. విూడియాతో మాట్లాడేందుకు సైతం ఆయన నిరాకరించారు. పోలీసులు విూడియాను సైతం కలువకుండా అక్బరుద్దీన్‌కు హుకుం జారీచేయడంతో ఆయన జైలునుంచి ప్రత్యేక వాహనంలో ఎక్కి హైదరాబాద్‌ వెళ్లారు.