జ్యూవెలరీ షోరూంలో భారీ దోపిడి
కోట్ల విలువ చేసే బంగారు , వజ్రాభరణాల చోరీ
చెన్నై,డిసెంబర్16 (జనం సాక్షి): తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు చెలరేగారు. కట్పడి రోడ్డులోని జోస్ అలుక్కాస్ షోరూం గోడను డ్రిల్ చేసిన దుండగులు షోరూంలోకి ప్రవేశించి 15 కిలోల బంగారం రూ 8 కోట్ల విలువైన డైమండ్ జ్యూవెలరీని చోరీ చేసి ఉడాయించారు. దోపిడీ ముఠా షోరూం పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్ వైపు నుంచి లేదా టెర్రస్ ప్రాంతం నుంచి దుండగులు షాపులోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డార్క్ ఫేస్ మాస్క్‌లు ధరించిన దుండగులు అక్కడున్న 12 సీసీటీవీ కెమెరాలకు పెయింట్ స్పే చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పొరుగున ఉన్న ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని వెల్లూర్ రేంజ్ డీఐజీ ఏజీ బాబు, ఎస్పీ రాజేష్ కన్నన్‌లు సందర్శించారు. దోపిడీ ముఠా గుట్టు రట్టు చేసేందుకు పోలీసుల నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ముమ్మరం చేశారు. షోరూం సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తుండగా షోరూం నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని సిబ్బంది ప్రింట్స్‌తో వాటిని తనిఖీ చేస్తున్నారు.