టమాటా ధరలు మరింత పైపైకి
కిలో 50కి చేరిన ధరలు
హైదరాబాద్,మే11(జనంసాక్షి): టమాటా ధరలు మరోమారు మోత మోగిస్తున్నాయి. మొన్నటి వరకు 36 రూపాయలకు కిలో ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా 50కి చేరింది. ఎండలు మండంతో కూరగాయల ధరలు మోత మోగిస్తున్నాయి. దాదాపు ఏ కూరగాయ తీసుకున్నా 80 నుంచి వంద వరకు కిలో ఉంటున్నాయి. టమాటాలు బాగా పండించే మదనప్లలె వ్యవసాయ మార్కెట్లో కిలో టమోటా రూ.42 పలికింది. ప్రస్తుతం తక్కువ దిగుబడులు ఉండటంతో ధరలు పెరిగాయి. గత వారం రోజుల నుంచి ధరలు పెరుగుతూ..తగ్గుతూ వస్తున్నాయి. వారం రోజుల కిందట అత్యధికంగా కిలో రూ.36 వరకు పలికాయి. అప్పటి నుంచి రోజు రోజుకు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నయి. మార్కెట్కు మదనప్లలె, పుంగనూరు, పీలేరు, తంబళ్లప్లలె నియోజకవర్గాల నుంచి 202 టన్నులు మాత్రమే రైతులు కాయలు తీసుకొచ్చారు. ఏ గ్రేడ్ కిలో రూ.30 నుంచి అత్యధికంగా రూ.42 వరకు, అలాగే రెండో రకం కిలో రూ.14 నుంచి అత్యధికంగా రూ.28 వరకు పలికింది. సగటున అత్యల్పంగా కిలో రూ.22 నుంచి అత్యధికంగా రూ.38 వరకు పలికాయి. మరో నెల రోజుల పాటు ధరలు ఇలాగే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో సాగునీరు లేక పంట దిగుబడులు తగ్గాయని, ఈ కారణంగా నాణ్యమైన టమోటా కూడా లభించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు టమోటాను వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు.