‘టాక్ టు ఏకే’
– ప్రజలతో కేజ్రివాల్ ముఖాముఖి
దిల్లీ,జులై 5(జనంసాక్షి):ఏవిధంగా చూసినా ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని కాదాయన. అయినా ఇప్పుడు మోదీ బాటలోనే ఆయన ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉండబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండటం సర్వసాధారణం. అయితే ఎప్పుడూ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే కేజ్రీవాల్.. ఈ కార్యక్రమం విషయంలో మాత్రం ఆయనను ఆదర్శంగా తీసుకున్నారనే విషయం తెలుస్తోంది. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మోదీ తమ పాలనావిధానాలు, వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘మన్ కీ బాత్’ పేరుతో కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. కేజ్రీవాల్ కూడా ప్రజలతో నేరుగా చర్చించేందుకు ఓ వేదికను తీసుకొస్తున్నారు.టాక్‌టుఏకే.కామ్ ద్వారా కేజ్రీవాల్ త్వరలోనే ప్రజలతో మాట్లాడనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వెబ్‌సైట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జులై 17 ఆదివారం 11 గంటలకు తొలి ఎపిసోడ్‌ను ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమం విషయంలో ఆప్ ప్రభుత్వానికి విమర్శలు కూడా ఎదురయ్యాయి. ప్రధానినిఅనుకరిస్తున్నారంటూ కొందరు వ్యాఖ్యలు చేయగా.. ఆప్ మాత్రం వాటిని ఖండించింది. కేజ్రీవాల్ చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలతో చర్చలు జరుపుతారని.. ప్రధాని మోదీలా ఒక్కరే మాట్లాడుకుంటూ వెళ్లరని ఆప్ వర్గాలు తిప్పికొట్టాయి.
మోదీ తరహాలో ‘ఏకపాత్ర సంభాషణ’లా కాకుండా ప్రజలతో ముఖాముఖీగా ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఆప్ పార్టీ 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం ఆయన పంజాబ్‌లో వచ్చే ఏడాది జరుగునున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. పంజాబ్‌లో బీజేపీ-అకాలీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే విధంగా బీజేపీ అధికారంలో ఉన్న గోవాలోనూ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్ తొలిసారిగా అడుగుపెడుతోంది. ఇప్పటికే గోవాలో కేజ్రీవాల్ తన ప్రచారాన్ని ప్రారంభించారు.