టామాటాలకు వర్షం దెబ్బ

మచ్చలతో నాణ్యతకు చిల్లు
చిత్తూరు,నవంబర్‌4 (జనంసాక్షి) : టమోటాపై వర్షం దెబ్బ పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట తడిసిపోయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల హెక్టార్లలో పంట సాగయింది. అందులో సగానికి పైగా తుది దశకు చేరుకుంది. ఈ దశలో వరుసగా వర్షాలు కురుస్తూండడంతో మార్కెట్‌కు ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. దీనికితోడు పూత, పిందె దశలో ఉన్న పంటలపై కూడా వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా బంకమట్టి నేలల్లో ఎక్కువగా నీరు నిలబడి పోవడంతో అక్కడి కాయలపై మచ్చలు ఏర్పడ్డాయి. అలాగే కాయల్లో నీటి శాతం పెరిగి దూర ప్రాంతాలకు తీసుకువెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వ్యాపారులు టమోటాల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ధరలు బాగున్నా.. అన్నదాతకు ఏమ్రాతం ప్రయోజనం చేకూరడం లేదు. మార్కెట్‌లో ప్రస్తుతం ధరలు బాగానే పలుకుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో కాయలు మార్కెట్‌కు రావడంలేదు. పైగా, ఆ వచ్చే వాటిలో కూడా అధికశాతం నీరుకాయలు, మచ్చలు ఏర్పడిన కాయలే వస్తున్నాయి. ఫలితంగా వ్యాపారులు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో 15 కిలోల మేలురకం కాయల బాక్సు రూ.350లకు పైగానే పలుకుతోంది. ఆ తరువాతి స్థాయి రకం కాయల బాక్సు ధర రూ.200 వరకు పలుకుతోంది. ఓ రకమైన
కాయల బాక్సు రూ.30 మొదలు రూ.150 వరకు పలుకుతోంది. వర్షంకారణంగా మచ్చలు ఏర్పడిన కాయలు, గిటకవారిన కాయలు, నీరు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. మార్కెట్‌ నుంచి కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, యూపీ, ఢిల్లీ, చత్తీ?సఘడ్‌ ప్రాంతాలకు కాయలు ఎగుమతి అవుతూంటాయి. అయితే ఇటీవలి వర్షాల కారణంగా కాయల్లో నాణ్యత తగ్గింది. మచ్చలు, నీరు కాయలు మార్కెట్‌కు ఎక్కువగా వస్తున్నాయి. ఈనేపథ్యంలో దూరప్రాంతాలకు తరలించే వ్యాపారులు వాటిని కొనుగోలు చేయడం లేదు. మార్కెట్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మూడు, నాలుగు రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న కాయలు అంతదూరం తీసుకువెళ్లేలోపే పాడైపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు మచ్చలు ఏర్పడిన కాయలను నగరాల్లో తీసుకోకపోవడంతో వ్యాపారులు అలాంటి వాటిని కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. దూరప్రాంతాలకు ఎగుమతి చేసే వ్యాపారులు మేలురకం కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. తరువాతిరకం కాయలను చుట్టు పక్కల రాష్టాల్రకు ఎగుమతి చేసే వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మండీల నిర్వాహకులు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్‌లో ధరలు బాగున్నప్పటికీ..జిల్లా రైతులకు ఆశించిన మేరకు లబ్ది చేకూరడం లేదు. మదనపల్లి మార్కెట్‌కు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టమోటా ఉత్పత్తులు భారీగా తగ్గాయి. గతంతో పోల్చితే మార్కెట్‌కు సగానికి పైగా ఉత్పత్తులు పడిపోయాయి. దీనికితోడు మార్కెట్‌/-లో మచ్చలున్న కాయలు రావడంతో వ్యాపారులు వెనక్కి తగ్గుతున్నారు. ఇటీవలి వర్షాల కారణంగా పంట నాణ్యత దెబ్బతిందని రైతులు అంటున్నారు.
మూడు వారాల క్రితంవరకు మార్కెట్‌లోని పెద్ద మండీలకు 25 నుంచి 30 వేల వరకు బాక్సులు వచ్చేవి. అలాగే ఓస్థాయి మండీలకు 15 వేలకు పైగా బాక్సులు వచ్చేవి. అయితే ప్రస్తుతం పెద్దమండీలకు 8 నుంచి 12 వేల వరకు, ఆ తరువాతి మండీలకు 5 నుంచి 8 వేల లోపు బాక్సులు మాత్రమే వస్తున్నాయి.