టాయ్‌లెట్ వినియోగానికి ఐదు రూపాయలా?
మంత్రి ప్రత్తిపాటి ఆశ్చర్యం
విజయవాడ,జూన్12(జనం సాక్షి ): విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో టాయిలెట్ వినియోగానికి వసూలు చేస్తున్న చార్జీలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం రక్షణమండలి సమావేశం సందర్భంగా ఆర్టీసి బస్టాండ్‌లో టాయిలెట్ చార్జీల అంశంపై చర్చకు వచ్చింది. టాయిలెట్ వినియోగానికి రూ. 5 వసూలు చేస్తున్నారని మంత్రికి చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. వెంటనే సంబంధితశాఖ మంత్రి అచ్చెనాయుడుతో ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్‌లో మాట్లాడారు. బస్టాండ్‌లో టాయిలెట్‌ల వినియోగానికి రూ.5 వసూలు చేయడంపై చర్చించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు బస్టాండ్‌లో అధిక చార్జీలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మంత్రి పుల్లారావుకు హావిూ ఇచ్చారు.ఒక్క విజయవాడ బస్టాండులోనే కాదు.. దాదాపు అన్ని బస్టాండుల్లోనే ఇదే రీతిలో వసూలు చేస్తున్నారని అక్కడున్న వారు మంత్రికి వివరించారు. దాదాపు రెండుమూడేళ్ల నుంచి ఈ రకంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి సామాన్యులకు ఇబ్బంది లేకుండా చేస్తామని మంత్రి పుల్లారావు చెప్పారు.