టిఆర్‌ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
లేకుంటే కుక్కలు చింపిన విస్తరే
తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీస్తున్న కేంద్రం
మండిపడ్డ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్
నల్గొండ,మే25(జనంసాక్షి): టిఆర్‌ఎస్ అధికారంలో ఉంటేనే తెలంగాణకు రక్ష అని, లేకుంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అభివృద్ధి ముఖ్యమని.. కులాలు ముఖ్యం కాదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… గత రెండు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని, రాష్టాల్రు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధిలో ముందుండే రాష్టాల్రను కేంద్రం ప్రోత్సహించాలని ఆయన అన్నారు. అయితే అందుకు విరుద్దంగా ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణపై కుట్రలు చేస్తున్నదని, రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్టాల్ర అస్తిత్వాన్ని దెబ్బతీయలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్టాన్రికి రావాల్సిన నిధులు రాకుండా కుట్ర చేస్తున్నదని విమర్శించారు. పైగా రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ పరువు పోయేలా మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని, అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు నేడు కులాల గురించి మాట్లాడుతున్నారని, అధికార యావ తప్ప వారికి వేరే ప్రాధాన్యం లేదని విమర్శించారు. తమకు అభివృద్ధి ముఖ్యమని, కులాలు కాదని చెప్పారు. కొన్ని శక్తులు కులాల పెరుచెప్పుకొని అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు ఎప్పుడూ కుల రాజకీయాలను నమ్మరని, అభివృద్ధి చేసినవారికే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన పార్థసారథిరెడ్డి హెటిరో ఫార్మాతో దేశ అభివృద్ధికి పాటు పడ్డారని చెప్పారు. అలాంటి వ్యక్తికి సీఎం కేసీఆర్ రాజ్యసభ ఇవ్వడం హర్షనియం. విభజన చట్టంలోని అంశాలను అమలు చేసేలా ఆలోచన చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన కోరారు.