టిఎన్‌ఎస్‌లో ఉంటా : వేణుగోపాలాచారి

అదిలాబాద్‌, నవంబర్‌ 23 :టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి రాజకీయ భవిష్యత్తుపై వచ్చిన ఊహాగానాలపై వేణుగోపాలాచారి వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన వేణుగోపాలాచారి టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల్లో చేరుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ ప్రచారంపై వేణుగోపాలాచారి స్పందిస్తూ తాను తెలంగాణ నగరా సమితిలోనే ఉంటూ తెలంగాణ వచ్చే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వేణుగోపాలచారి ముఖ్యమైన నాయకునిగా చలామణి అవుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా.. ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల వేణుగోపాలాచారి కాంగ్రెస్‌ నాయకులను కలిసి సమావేశాలు నిర్వహించడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వేణుగోపాలాచారి ఆయన రాజకీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా వివిధ రకాలుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.