టిక్కెట్‌ దక్కని వారి తిరుగుబావుటా

ఎన్సీపీ,బిఎస్పీల ద్వారా పోటీకి రంగం సిద్దం

ఖమ్మం,నవంబర్‌17(జ‌నంసాక్షి): మహాకూటమిలో ప్రధానమైన కాంగ్రెస్‌ పార్టీలో ఆశావహులకు టిక్కెట్లు దక్కకపోవడంతో తిరుగుబావుటా ఎగరేశారు. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మానుకొండ రాధాకిశోర్‌ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌కు బలమైన ఖమ్మం స్థానాన్ని పొత్తు పేరుతో తెదేపాకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు వీరిద్దరూ తమ అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. అసమ్మతి నేతలు ఎన్సీపీ, బీఎస్పీ టిక్కెట్ల పై పోటీ… ఖమ్మం, వైరా అసెంబ్లీ స్థానాల్లో ఆశించిన పార్టీ టిక్కెట్‌ దక్కని వారు ఎలాగైనా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. మరీ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచే కంటే వేరే ఏదైనా రాజకీయ పార్టీ టిక్కెట్‌ తెచ్చుకుని పోటీ చేయాలని యోచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్లు ఆశించి భంగపడిన కోనేరు కోనప్ప (సిర్పూర్‌ కాగజ్‌నగర్‌), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌) బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్లపై

పోటీ చేసి విజయం సాధించారు. ఆ విధంగా 2018 ఎన్నికల్లో వేరే పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు పలువురు యోచిస్తున్నారు.మరోవైపు మహాకూటమి తరఫున తెదేపా టిక్కెట్‌ దక్కించుకున్న నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కని వారిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మానుకొండ రాధాకిశోర్‌ను ఆయన ఇంటికెళ్లి నామా నాగేశ్వరరావు కలిశారు. అయినా ఆయన నామినేషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు పోట్ల నాగేశ్వరరావు శుక్రవారం రాత్రి తన నివాసంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. 18న ఓ ఫంక్షన్‌హాల్‌లో భారీ స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి వారందరి అభిప్రాయం మేరకు ఖమ్మం స్థానంలో 19న నామినేషన్‌ దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఖమ్మం టిక్కెట్‌ రేసులో చివరి వరకూ నిలిచిన వద్దిరాజు రవిచంద్ర సైతం కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కక పోవటంతో అసంతృప్తితో ఉన్నారు. తన అనుచరగణంలో ఆయన ఖమ్మంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి జరిగిన పరిణామాలు ప్రజలకు వివరించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఖమ్మంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు దక్కని వారు ఎన్సీపీ టిక్కెట్‌ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని…ప్రచారంలో మూడు రంగుల జెండాలు ఉపయోగించుకునే అవకాశం వస్తుందని యోచిస్తున్నారు. శరద్‌పవార్‌ ఎన్సీపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్సీపీ జాతీయ పార్టీగా ఎన్నికల సంఘంలో నమోదైంది. ఎన్సీపీ నాయకులను సంప్రదించి పార్టీ బీ ఫారం తెచ్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బీఎస్పీ జాతీయ పార్టీగా ఎన్నికల సంఘంలో నమోదైంది. ఇప్పటికే జిల్లాలో బీఎస్పీ పార్టీ కార్యకలాపాలను కొందరు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బీఎస్పీ నేతలను సంప్రదించి పార్టీ టిక్కెట్‌ పట్టి బీ ఫారం సాధించి ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైరా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడిన లావుడ్యా రాములునాయక్‌ బీఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనకు బీఎస్పీ టిక్కెట్‌ దక్కినట్లు తెలుస్తోంది.