టిటిడి సరికొత్త నిర్ణయం

పదిరోజులపాటు తెరుచుకోనున్న వైకుంఠద్వారం
తిరుపతి,నవంబర్‌27( జనం సాక్షి ):  వైకుంఠ ద్వారాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని టిటిడి భావిస్తోంది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించింది. ఆగమ శాస్త్ర నిపుణులు ఇందుకు అంగీకరించారని, పాలక మండలి ఆమోదం తరువాత నూతన విధానాన్ని అమలులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలను తెరిచి, ఆపై 10 రోజుల పాటు వీటి గుండా భక్తులను పంపాలని, ఈ నిర్ణయం వల్ల భక్తుల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని, మరింత మందికి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించే వీలుంటుందని అధికారులు అంటున్నారు. జనవరి 6 న వైకుంఠ ఏకాదశి రానుంది. పాలక మండలి అంగీకరిస్తే, అప్పటి నుంచి సంక్రాంతి పండగ ముగిసేవరకూ ఈ ద్వారం తెరచుకునే ఉంటుందన్నమాట.