టిడిపి నేతల అరెస్ట్‌ దారుణం

మహాపాదయాత్రను అడ్డుకోవడంపై బాబు మండిపాటు
చిత్తూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. హంద్రీ – నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహా పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామని… అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నామని వ్యాఖ్యానించారు. తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలని, అక్రమ కేసులను తొలగించాలని  డిమాండ్‌ చేశారు. రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలన్నారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలని… హంద్రీ – నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు.