టీఎన్‌జీవోలు మళ్లీ సమ్మెబాట

– ప్రభుత్వానికి నేడు నోటీస్‌

– మార్చి 20న చలో హైదరాబాద్‌

– ఆంధ్రా ఎన్‌జీవోలు ర్యాలీ ఎట్ల తీస్తరు

– మార్చి 3న బస్సుయాత్ర : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల జేఏసీ నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగుల తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాలోని మార్చి 1 నుంచి ర్యాలీలు నిర్వహించాలని వారు నిర్ణయించారు. పదవ పీఆర్సీ, హెల్త్‌కార్డుల జారీ, సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు దినంగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తూ… ఆ రోజు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. సకల జనుల సమ్మె కాలంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ నెల 24న తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న సడక్‌ బంద్‌ కారక్రమంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 20వ తేదీన ‘ చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఛలో అసెంబ్లీ వేదికగా సమ్మె తేదీని ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2న ఏపీ ఎన్జీవోలు చేపట్టనున్న ‘ఛలో హైదరాబాద్‌ ర్యాలీ’ని వాయిదా వేసుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. సమైకాంధ్ర అంటున్న ఏపీ ఎన్జీవోలకు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించుకునే అర్హత లేదని వారు అన్నారు. కావాలంటే గంటూరు, విశాపట్నంలోని ర్యాలీలు నిర్వహించుకోవచ్చనని సూచించారు. వచ్చే నెల 3న తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ సమావేశంలో టిఎన్‌జివో అధ్యక్షుడు దేవిప్రసాద్‌, నాయకులు విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.