టీటీడీ అక్రమార్కులకు నిలయంగా మారింది
– నిత్యమూ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారు
– ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు
– తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
– గవర్నర్ నరసింహను కలిసి వివరించిన బీజేపీ నేతలు
హైదరాబాద్, జనవరి22(జనంసాక్షి) : తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమార్కులకు నిలయంగా మారిపోయిందని, అక్కడ అధికారులు ఎన్ని దారుణాలకు పాల్పడుతున్నా, ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలంగాణ ఇరు రాష్ట్రాల బీజేపీ నేతలు ఆరోపించారు. మంగళవారం ఇరు రాష్ట్రాల్లోని పలువురు బీజేపీ నేతలు కలిసి గవర్నర్ వద్దకు వెళ్లి, టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను గురించి ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రోజురోజుకూ అధికారుల ఆగడాలు పెచ్చువిూరుతున్నాయని ఆరోపించారు. గత నెలలో టికెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. టికెట్లను భారీ ఎత్తున అమ్ముకుంటున్నారని బహిర్గతమైనా ఏపీ సర్కారు పట్టించుకోలేదని చెప్పారు. నిందితులను ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని, కనీసం వారిపై విచారణ కూడా జరిపించలేదని లక్ష్మణ్ ఆరోపించారు. నిత్యమూ వందలాది టికెట్లను బ్లాక్ లో అమ్ముతూ కోట్లను దండుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మణ్ తో పాటు నరసింహన్ ను కలిసిన మాజీ డీజీపీ, ప్రస్తుత బీజేపీ నేత దినేష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను డీజీపీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తాము గవర్నర్ ను కోరినట్టు ఆయన తెలిపారు.