టీడీపీ ఎంపీలు..
రాజకీయ లబ్ధికోసం యత్నిస్తున్నారు
– సమావేశంలో జీవీఎల్ ఉండడం తప్పుకాదు
– రైల్వేజోన్‌పై కేంద్రం సానుకూలంగా ఉంది
– త్వరలో ప్రకటన వస్తుంది
– బీజేపీ నేత మాణిక్యాల రావు
అమరావతి, ఆగస్టు8(జనం సాక్షి) : రైల్వే జోన్ పై కేంద్రం సానుకూలంగా ఉందని, ఈమేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని బీజేపీ నేత మాణిక్యాల రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైల్వే జోన్ విషయంలో రాజకీయం చేస్తూ.. లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రాజెక్టులు రాకపోయినా ఫర్వాలేదు రాజకీయ లబ్ధి చేకూరితే చాలని టీడీపీ నేతలు అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి అన్ని విధాల అండగా ఉండేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. అయినా కేంద్రం ఇస్తున్న నిధులను తీసుకుంటూ మళ్లీ కేంద్రం ఏవిూ ఇవ్వటం లేదని టీడీపీ తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీని నిందిస్తుందని మాణిక్యాలరావు మండిపడ్డారు. టీడీపీ ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఏపీ అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని, చేస్తూనే ఉంటుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని తెలిసికూడా, మంత్రి సమావేశానికి రావడం కాస్త ఆలస్యమైందని నిలదీయడం సరికాదని మాణిక్యాలరావు అన్నారు. ఆ సమావేశంలో జీవీఎల్ నరసింహారావు ఉండడం తప్పుకాదని అన్నారు. టీడీపీ ఎంపీలు సమావేశం సరిగా జరగకుండా ఉండేందుకు జీవీఎల్‌పై ఘర్షణకు దిగారని తద్వారా గందరగోళం సృష్టించి సమావేశాన్ని జరగకుండా చూశారని అన్నారు. మళ్లీ కేంద్రం మంత్రి సభ్యతగా ప్రవర్తించలేదని కేంద్రమంత్రి కార్యాలయం ఎదుట ఆందోళన చేయటం సిగ్గుచేటన్నారు.
టీడీపీ ఎంపీల విధానంతో ఏపీ పరువు పోతుందన్నారు. ఇప్పటికైన టీడీపీ ఎంపీలు అసత్య ప్రచారాలు మాని సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.