టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ప్రదర్శన, మానవహారం

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మంలో ఈ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ కళ్లు తెరిపించాలని కోరుతూ డాక్టర్‌ బీఆర్‌ ఆంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తొలుత, ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి ఇల్లందు క్రాస్‌ రోడ్‌, వైరారోడ్‌, కలెక్టరేట్‌ మీదుగా జెడ్పీసెంటర్‌ వరకు ప్రదర్శన సాగింది. 7, 12 డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు రోటరీనగర్‌ నుంచి జడ్పీసెంటర్‌ వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, అక్కడ అందరూ కలిసి మానవహారం నిర్వహించారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, చేతగాని సీఎం గద్దె దిగాలని నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వ కళ్లు తెరిపించాలని కోరుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ఈకార్యక్రమాన్నుద్దేశించి ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. చేతగాని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి, ప్రజలపై భారాలు మోపుతున్న  ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలన్న డిమాండ్‌తో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌కు పతనం తప్పదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుతుంబాక బసవనారాయణ, వల్లభనేని గంగాధర్‌ చౌదరి, వల్లంకొండ వెంకట్రామయ్య, మదార్‌ సాహెబ్‌, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.