టీడీపీ ఎమ్మెల్యేల వెనుకాల వల్లభనేని వంశీ!

– దూరంగా ఒక్కడే కూర్చున్న వంశీ
అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాగా ఈ సమావేశాల ప్రారంభానికి ముందు వల్లభనేని వంశీపైనే అందరి దృష్టి పడింది. వంశీ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. కాగా ఆయన వైసీపీ చేరుతానని చెప్పారు.అ యినా ఇప్పటి వరకు వైసీపీలో చేరలేదు. మరోవైపు టీడీపీసైతం వంశీని పార్టీనుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో వంశీ ఎక్కడ కూర్చున్నారనే చర్చ సాగింది. కాగా సోమవారం ప్రారంభమైన
అసెంబ్లీ సమావేశాల్లో వంశీ టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీ సభ్యులకు కేటాయించిన సీట్లలోనే వెనుక వరుసలో ఎవరితో సంబంధం లేకుండా ఓ మూలన కూర్చున్నట్టుగా వెనుకాల వల్లభనేని వంశీ కూర్చున్నారు. టీడీపీ సభ్యులతోనూ, వైసీపీ సభ్యులతోనూ పెద్దగా మాట్లాడలేదు. ఇదే సమయంలో వంశీ దగ్గరకి వెళ్లిన పలువురు టీడీపీ సభ్యులు టీడీఎల్పీ కార్యాలయంలోకి రావాలని కోరారు. వంశీ సున్నితంగా తిరస్కరించారు. తరువాత వారు వంశీతో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు వంశీ వద్ద నుంచి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంశీ వద్దకు వచ్చారు. తమ కార్యాలంయలోకి రావాలని కోరగా వంశీ స్పందించలేదు. దీంతో వంశీ కొద్దిరోజులు మౌనంగా ఉండాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం వైసీపీలో చేరేందుకు వంశీ సిద్ధమైనట్లు ఆయన వర్గీలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిసైతం వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగింది. కాగా సోమవారం ఆయన అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల వెంటే కూర్చున్నారు. అసెంబ్లీ ఆవరణంలో టీడీపీ వీడుతున్నారా..? అని విలేకరులకు రవిని ప్రశ్నించగా.. తాను పార్టీ మారబోనని, ఆ పరిస్థితి లేదని అన్నారు. తనపై అసత్య ప్రచారం జరుగుతుందని, తాను టీడీపీలోనే కొనసాగానని గొట్టిపాటి తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ అసెంబ్లీకి హాజరుకాలేదు. గత కొంతకాలంగా ఆయన టీడీపీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. పలువురు బీజేపీ కేంద్ర పెద్దలతోనూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం సాగింది. గత మూడు రోజుల క్రితం తాను టీడీపీలో ఉంటానని గంటా ప్రకటించారు. కాగా ఆయన సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మరో టీడీపీ ఎమ్మెల్యేలు తమ సొంత పనులపై అసెంబ్లీకి రాలేక పోతున్నామని టీడీపీ అధిష్టానానికి తెలిపారు. మొత్తంవిూద సోమవారం 17మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభకు హాజరయినట్లు తెలిసింది.