టెన్త్‌ సిలబస్‌ పూర్తిలో వెనకబడ్డ సర్కార్‌ పాఠశాలలు ?

పునశ్చరణకు ఇదే సమయం

అమరావతి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): మార్చిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది. పరీక్షల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం ద్వారా చాలావరకు ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదువుకోవాలి. అయితే ఒకవైపు పాఠ్యపుస్తకాలు అందక.. మరోవైపు ఉపాధ్యాయుల కొరతతో ఉత్తమ ఫలితాల సాధనపై ఉపాధ్యాయులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకనైనా అప్రమత్తంగా వ్యవహరించి సిలబస్‌ను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నవంబరు 30 నాటికి సిలబస్‌ పూర్తిచేసి డిసెంబరు నుంచి పునశ్చరణకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే హడావిడి కారణంగా సమగ్ర అవగాహనరాదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొన్ని పాఠ్య పుస్తకాలు ఆలస్యంగా అందడం, ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు న్యాయం జరగలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం ఇప్పటి వరకు పాఠాల బోధనే పూర్తి కాలేదు. విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం డిసెంబర్‌ నాటికి అర్ధ సంవత్సరానికి సంబంధించి ఎస్‌ఎస్‌మెంట్‌ పరీక్ష నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. పదో తరగతిలో నవంబర్‌నాటికి పాఠాలు పూర్తిచేసి రివిజన్‌ మొదలుపెట్టాలి. ప్రస్తుత పరీక్ష విధానంలో 80 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంది. మరో 20 మార్కులు ఏడాదిలో పెట్టే నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనం, రెండుసార్లు నిర్వహించే సంగ్రహ ణాత్మక మూల్యాంకనంలో వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం విద్యార్థులు గతంలో మాదిరిగా బట్టీ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. నూతనంగా ప్రవేశపెట్టిన సీసీ ప్యాట్రన్‌ విధానంలో విద్యార్థి పూర్తిగా అచ్చు పుస్తకం చదవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీనిపై విద్యార్థులను చైతన్యం చేయాల్సి ఉంది.కొత్త పాఠ్యాంశాలకు పాత విధానంతో బోధనకు మధ్య సమన్వయం లేకపోవడం అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పది పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇంత వరకు బాగానే ఉన్నా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఫలితంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి బోధనపై బదిలీల ప్రభావం ఎక్కువగా ఉంది. సెప్టెంబరు, అక్టోబర్‌ నెలల్లో పాఠ్యాంశాల బోధనకు అవరోధం ఏర్పడిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎనిమిదేళ్లు దాటిన ఉపాధ్యాయులు, ఐదేళ్లు దాటిన ప్రధానోపాధ్యా యులకు బదిలీ అవకాశం ఉండడంతో వీరిలో చాలామంది విద్యాబోధనపై దృష్టి సారించలేకపోయారు. వివిధ సబ్జెక్టుల బోధనకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. పది విద్యార్థులు ఉన్నత ఫలితాలు తెచ్చే విధంగా విద్యాశాఖ అధికారులు పటిష్టమైన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరీక్షల షెడ్యూల్‌ విడుదలైనా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బదిలీల నేపథ్యంలో రెండు నెలల పాటు సమయం వృథా అయింది. ఇప్పటికే ప్రైవేట్‌ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుల సిలబస్‌ దాదాపు పూర్తిచేసి రివిజన్‌ చేపట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సిలబస్‌ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఇకనైనా పక్కా ప్రణాళికలు రూపొందించాలి. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.